గ్లోబల్ మార్కెట్ లోకి తెలంగాణ సన్నబియ్యం 

గ్లోబల్ మార్కెట్ లోకి తెలంగాణ సన్నబియ్యం 
  • ఇప్పటికే ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌కు 30 వేల టన్నుల ఎగుమతి  
  • వివిధ ఆసియా, ఆఫ్రికా, మిడిల్‌‌‌‌‌‌‌‌ ఈస్ట్‌‌‌‌‌‌‌‌ దేశాలపైనా ​ఫోకస్‌‌‌‌‌‌‌‌   
  • దీర్ఘకాలిక సరఫరా ఒప్పందాల కోసం సర్కారు సన్నాహాలు   
  • మనీలాలో అంతర్జాతీయ రైస్‌‌‌‌‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌‌‌‌‌–2026 వేదికగా 
  • భాగస్వామ్యానికి  సివిల్‌‌‌‌‌‌‌‌ సప్లయ్స్‌‌‌‌‌‌‌‌ కమిషనర్​కు ఆహ్వానం 

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు:   తెలంగాణ సన్నబియ్యాన్ని అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌‌‌‌‌లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర సర్కారు కార్యాచరణ సిద్ధం చేసింది. దేశీయ అవసరాలకు బియ్యం సరఫరా చేయడంతోపాటు మిగులు నిల్వలకు విదేశీ మార్కెట్లలో మెరుగైన ధర లభించేలా ఎక్స్‌‌‌‌‌‌‌‌పోర్ట్స్‌‌‌‌‌‌‌‌ను ప్రోత్సహించాలని భావిస్తున్నది. ఇప్పటికే ఫిలిప్పీన్స్‌‌‌‌‌‌‌‌కు 30 వేల టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసిన అనుభవంతో ఇతర దేశాలకూ సరఫరా పెంచాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఇందులో భాగంగా ఆసియా, ఆఫ్రికా, పశ్చిమాసియా దేశాల్లో తెలంగాణ సన్న, సూపర్‌‌‌‌‌‌‌‌ ఫైన్‌‌‌‌‌‌‌‌ రకం బియ్యానికి మార్కెట్‌‌‌‌‌‌‌‌ అవకాశాలను అన్వేషిస్తోంది. అంతర్జాతీయ కొనుగోలుదారులతో దీర్ఘకాలిక ఒప్పందాలు కుదుర్చుకొని తెలంగాణ బియ్యానికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకురావడంపై సివిల్​ సప్లయ్స్​ శాఖ ప్రత్యేక దృష్టి సారించింది.

మనీలాలో మన బియ్యంపై ప్రచారం

అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌ అవసరాలకు తగ్గట్టుగా ఉత్పత్తి, సరఫరా వ్యవస్థలను అభివృద్ధి చేసుకోవడం ద్వారా తెలంగాణ బియ్యానికి మరింత విలువ తీసుకురావచ్చని ప్రభుత్వం భావిస్తున్నది. ఈ క్రమంలో తాజాగా ఫిలిప్పీన్స్‌‌‌‌ రాజధాని మనీలాలో జరుగుతున్న ‘ఇంటర్నేషనల్‌‌‌‌ వరల్డ్‌‌‌‌ రైస్‌‌‌‌ కాన్ఫరెన్స్‌‌‌‌–2026’లో తెలంగాణ బియ్యం ఉత్పత్తి, ఎగుమతి అవకాశాలను రాష్ట్ర సివిల్​ సప్లయ్స్ శాఖ కమిషనర్‌‌‌‌ స్టీఫెన్‌‌‌‌ రవీంద్ర వివరించారు. అంతర్జాతీయ బియ్యం కొనుగోలుదారులు, దిగుమతిదారులు, వ్యాపార సంస్థలు తెలంగాణతో నేరుగా భాగస్వామ్యం కావాలని ఆయన ఆహ్వానించారు. నాణ్యమైన సన్న, సూపర్‌‌‌‌ ఫైన్‌‌‌‌ రకం బియ్యాన్ని విదేశీ మార్కెట్లకు సరఫరా చేయగల సామర్థ్యం తమ రాష్ట్రానికి ఉందని పేర్కొన్నారు. 

దేశ బియ్యం ఉత్పత్తిలో 12 శాతం వాటా

రాష్ట్ర వ్యవసాయ రంగం గణనీయమైన పురోగతి సాధిస్తున్నది. గత సీజన్‌‌‌‌లో రాష్ట్రంలో 18.5 మిలియన్‌‌‌‌ టన్నుల బియ్యం ఉత్పత్తి జరిగింది. దేశవ్యాప్తంగా బియ్యం ఉత్పత్తిలో తెలంగాణ వాటా దాదాపు 12 శాతంగా ఉంది. దేశం బియ్యం సాగు విస్తీర్ణంలో రాష్ట్ర వాటా దాదాపు 10 శాతమే ఉన్నప్పటికీ, అధిక ఉత్పత్తిని సాధించడం విశేషం. ఇప్పటివరకు మిగులు బియ్యం నిల్వల నిర్వహణపై ప్రధానంగా దృష్టి పెట్టిన సివిల్​ సప్లయ్స్ శాఖ.. ఇకపై వాటికి అంతర్జాతీయ మార్కెట్లలో మెరుగైన ధర లభించేలా చర్యలు చేపట్టాలని యోచిస్తున్నది. 

నాణ్యతకు పెద్దపీట

ప్రపంచ మార్కెట్‌‌‌‌లో పోటీని తట్టుకునేందుకు అంతర్జాతీయ ప్రమాణాలకు తగ్గట్టుగా బియ్యం నాణ్యత ఉండేలా చూడడం కీలకమని ప్రభుత్వం భావిస్తున్నది. విదేశీ కొనుగోలుదారుల అవసరాలకు అనుగుణంగా సన్న, సూపర్‌‌‌‌ ఫైన్‌‌‌‌ రకాల బియ్యాన్ని సరఫరా చేయడంతోపాటు పారదర్శక మార్కెటింగ్‌‌‌‌ వ్యవస్థలను అభివృద్ధి చేయాలని యోచిస్తున్నది. బియ్యం ఏ ప్రాంతంలో ఉత్పత్తి అయింది? దాని నాణ్యత ఏమిటి? లాంటి  వివరాలను గుర్తించేలా సరఫరా వ్యవస్థను రూపొందించడంపైనా దృష్టి సారిస్తున్నది. తెలంగాణ బియ్యాన్ని కేవలం ముడి సరుకుగా కాకుండా.. నాణ్యతకు పేరున్న బ్రాండ్‌‌‌‌గా అంతర్జాతీయ మార్కెట్‌‌‌‌లో నిలబెట్టాలనే లక్ష్యంతో ముందుకుపోతున్నది.

రైతులకు, రాష్ట్ర ఆర్థిక వ్యవస్థకు ప్రయోజనం

మిగులు బియ్యాన్ని విదేశీ మార్కెట్లకు తరలించడం ద్వారా నిల్వల నిర్వహణ భారం తగ్గడంతోపాటు బియ్యానికి మెరుగైన మార్కెటింగ్‌ అవకాశాలు లభిస్తాయని ప్రభుత్వం భావిస్తున్నది. దీర్ఘకాలిక ఎగుమతి ఒప్పందాలు కుదిరితే బియ్యం సరఫరాపై ముందస్తు ప్రణాళిక రూపొందించుకోవడానికి వీలవుతుంది. తద్వారా రాష్ట్ర అగ్రికల్చర్, సివిల్​ సప్లయ్స్ రంగాలకు ప్రయోజనం కలుగుతుంది. అయితే, ఎగుమతులను పెంచే క్రమంలో రాష్ట్ర ప్రజల అవసరాలకు సరిపడా బియ్యం అందుబాటులో ఉండేలా చూడటం కీలకం. ఈ నేపథ్యంలో దేశీయ ఆహార భద్రతకు ఇబ్బంది కలగకుండా మిగులు నిల్వలను సమర్థంగా వినియోగించుకుంటూ అంతర్జాతీయ మార్కెట్‌లో తెలంగాణ సన్నబియ్యానికి స్థానం కల్పించాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నది.